Monday, 27 July 2026 03:43:31 PM

స్వాతంత్ర్య సమరయోధులు రూపాకుల దంపతుల విగ్రహావిష్కరణ

Date : 06 July 2026 06:33 AM Views : 105

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / తెనాలి : జూలై 5 : గుంటూరు జిల్లా తెనాలిలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు రూపాకుల విశాలాక్షి, రూపాకుల సుబ్రహ్మణ్యం దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించి, వారి దేశసేవలను స్మరించుకున్నారు.

రూపాకుల దంపతులు స్వాతంత్ర్య పోరాటంలో విశేష పాత్ర పోషించడమే కాకుండా, విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని సామాజిక చైతన్య కార్యక్రమాల్లోనూ ముందుండి పనిచేశారు. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించేందుకు కృషి చేసి సామాజిక సమానత్వానికి బాటలు వేశారు. దేశానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం వారికి తామ్రపత్రం ప్రదానం చేసింది. వారి సేవలకు గుర్తింపుగా విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బర్లపేటలో ఏర్పాటు చేసిన విగ్రహాలను అప్పటి ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. తాజాగా వారి స్వగ్రామమైన తెనాలిలోనూ విగ్రహాలను ప్రతిష్ఠించి గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం విశేషంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రూపాకుల రవికుమార్, విజయనగరం జిల్లా జొన్నవలస గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పూసపాటి బుజ్జి సీతారామచంద్రరాజు మనుమడు, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మాజీ ఎంపీపీ దంతులూరి గోపాలకృష్ణ రాజు (గోపిబాబు), పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :