Tuesday, 25 August 2026 04:24:14 PM

కార్మిక నేత చిల్ల ధర్మారెడ్డి సేవలు చిరస్మరణీయం

Date : 11 August 2026 06:59 PM Views : 77

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ తగరపువలస : చిట్టివలస, ఆగస్టు 11: కీర్తిశేషులు చిల్ల ధర్మారెడ్డి 8వ వర్ధంతిని పురస్కరించుకుని చిట్టివలస జ్యూట్ మిల్ కాంగ్రెస్ కార్మిక సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ధర్మారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. చిల్లపేట గ్రామంలో 1978లో చిల్ల శంకర్ రెడ్డి, ఆదమ్మ దంపతులకు జన్మించిన ధర్మారెడ్డి డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేశారు. చిన్న వయసులోనే కార్మిక ఉద్యమంలోకి ప్రవేశించిన ఆయన, తొలుత చిల్ల శంకర్ రెడ్డి, అనంతరం చిల్ల ఎర్రయ్య రెడ్డి నాయకత్వంలో పనిచేశారు. వారి అనంతరం జ్యూట్ మిల్ కాంగ్రెస్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్. గంగాధర్ రెడ్డి, చిల్ల ధర్మారెడ్డి నాయకత్వంలో జ్యూట్ మిల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. 1974, 1975, 1976 సంవత్సరాలకు చెందిన కార్మికులకు సంబంధించి యాజమాన్యంతో చర్చించి, 2007లో 598 మంది కార్మికులను పర్మినెంట్ చేయించడంలో ధర్మారెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

అలాగే కార్మికులకు రావాల్సిన కరువు భత్యం (డీఏ) రూ.402 పెరిగిన సమయంలో యాజమాన్యం మొండి వైఖరి అవలంబించగా, కార్మికుల హక్కుల కోసం ధర్మారెడ్డి ధైర్యంగా పోరాడి డీఏ ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. యాజమాన్యం ఒత్తిళ్లకు, బెదిరింపులకు భయపడకుండా కార్మికుల పక్షాన నిలిచిన ధైర్యసాహసాలు కలిగిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ధర్మారెడ్డి ఆటో సంఘం అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవలందించారని తెలిపారు. గ్రామంలో చిన్నవారికి చిన్నవాడిగా, పెద్దలకు పెద్దవాడిగా అందరితో కలిసిమెలిసి ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఏడు గ్రామాలకు ఇలవేలుపుగా భావించే శ్రీ పోలమ్మతల్లి ఆలయ పునర్నిర్మాణంలో ధర్మారెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆలయ నిర్మాణానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. చిన్న వయసులోనే ధర్మారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం గ్రామానికి, జ్యూట్ మిల్ కార్మిక ఉద్యమానికి తీరని లోటుగా మిగిలిపోయిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :